అది 1939. రెండో ప్రపంచ యుద్ధ సమయం. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేకచోట్ల విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న సందర్భమది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లె థియోసాఫికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా ఉద్యమం నడుపుతున్నారు. ఆ ఉద్యమానికి ఆజానుబాహుడైన ఒక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు. అతనిపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జీ చేశారు. విపరీతంగా కొట్టడంతో అతను స్పృహతప్పి పడి పోయాడు. పోలీసులు గప్‌చుప్‌గా అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ విద్యార్థే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించి ఉండరు.
ఆయనది ధీర గంభీర రూపం. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన మనసంతా అభిమానం. ప్రత్యర్థులకు సింహస్వప్నమైనా అనుచరులకు మాత్రం ఆయన పెద్దాయన. కోట్ల విజయభాస్కరరెడ్డి విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నాడు. రాజకీయవేత్తలు చాలామంది ఉంటారు. కానీ పరిపాలనాదక్షులు కొంతమందే ఉంటారు. చాలామంది పరిపాలనాదక్షులకు నిజాయితీ ఉండదు. విజయభాస్కరరెడ్డిలో ఆ రెండు ప్రత్యేకతలూ ఉన్నాయి. అడ్వొకేట్ వృత్తి చేస్తూనే ఆయన రాజకీయ రంగంలోకి దిగారు.
కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో వీగిపోవడానికి కారకుడైన రాజకీయ ఉద్దండుడు నాయకంటి శంకరరెడ్డిని 1955 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి ఓడించడం ద్వారా కోట్ల విజయభాస్కరరెడ్డి యావదాంధ్ర రాష్ట్రం దృష్టిని ఆకర్షించారు.
ఆయన మంచి క్రీడాకారుడు కూడా. కాలేజీలో ఆయన హాకీ, ఫుట్‌బాల్ టీమ్‌లకు కెప్టెన్. ఎన్నో సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన వివిధ కీలక శాఖల మంత్రిగా వున్నారు. రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, మూడుసార్లు కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. 1991లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రిక కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల నిజాయితీ, సామర్థ్యాలపై ఒక సర్వే జరపగా, విజయభాస్కరరెడ్డి ప్రథముడిగా ఎన్నికైనారు.
విజయభాస్కరరెడ్డి తన తల్లి గారి ఊరు కర్నూలు జిల్లా అమకతాడులో జన్మించారు. స్వస్థలం లద్దగిరి. కోట్ల పెదనాగిరెడ్డి, వెంకమ్మ గార్ల ఏకైక మగ సంతానం. 1920 ఆగస్టు 16న జన్మించిన కోట్ల మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలో చేరినా లాఠీచార్జి, తీవ్ర గాయాల కారణంగా బీఏ పరీక్షలు రాయలేకపోయారు. 1944లో మద్రాసులోని మినర్వా ట్యుటోరియల్ కాలేజీలో చేరి డిగ్రీని పూర్తి చేశారు. 1945-47 మధ్య కాలంలో మద్రాసు లా కాలేజీ నుంచి బీఎల్ పట్టా పొంది కొంతకాలం మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి నిర్వహిం చారు. 1950 జూన్ 7న ఆయన శ్యామలాదేవిని వివాహమాడారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా పేరొందిన కోట్ల విజయభాస్కర రెడ్డిది విశిష్టమైన రాజకీయ చరిత్ర. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడే నాగార్జునసాగర్ నీటిని తొలిసారిగా కాల్వలకు వదలడమే కాకుండా మొదటి సంవత్సరమే ఆ రిజర్వాయర్ నీటిని 87 శాతం వాడుకలోకి తెచ్చి ప్రపంచ రికార్డును సాధించారు. 1977 నుండి 1999 వరకూ ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తొలిసారి, తిరిగి 1992లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పదవిని నిర్వహించారు. 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమికి విజయభాస్కరరెడ్డి బాధ్యత లేదని భావించిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆయనను కేంద్రంలో మంత్రిగా నియమించారు.
కీలకమైన నౌకా, రవాణాయానం, తదుపరి పరిశ్రమలశాఖను అప్పగించారు. ఆ తరువాత రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో, తిరిగి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పని చేశారు. ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రికీ లభించని గౌరవం కోట్ల విజయభాస్కరరెడ్డికి లభించింది. ఆయన కాంగ్రెస్-ఐ పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడుగానే కాకుండా రెండుసార్లు కాంగ్రెస్-ఐ వర్కింగ్ కమిటీలోను, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలిలోనూ సభ్యులుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పరిశీలకుడుగా కూడా వ్యవహరించారు.
1967లో బ్రహ్మానందరెడ్ది మంత్రివర్గంలో ఉన్నప్పుడే కోట్ల రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. 1982లో ముఖ్యమంత్రి కాగానే మంత్రివర్గ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముందు రాయలసీమ కరువు ప్రాంతాన్ని సందర్శించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఎన్టీ రామారావుకు ముందే కిలో బియ్యం రూ. 1.90 పైసలకే అందించా రాయన. అలాగే ఏడాదికి 50 రూపాయల విద్యుత్ హార్స్‌పవర్ శ్లాబ్‌ను రామారావు హయాంకు ముందే ప్రవేశపెట్టిన ఘనత కూడా కోట్లదే.
తన క్యాబినెట్‌లో బీసీలకు, ఎస్సీలకు సముచిత స్థానం కల్పించి అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఇప్పుడు విశేష ప్రచారానికి నోచుకున్న ‘డ్వాక్రా’ మహిళాభివృద్ధి పథకానికి రూపకల్పన చేసి అమలుపరచింది కూడా కోట్ల హయాంలోనే. రాష్ట్రంలో సారా నిషేధించాలని వారు తీసుకున్న నిర్ణయం ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయి.
అన్నేళ్లు పదవులు అనుభవించినా ఆయనకు సొంత వ్యాపారా లంటూ ఉండేవి కావు. సొంత భూములు, పండ్ల తోటల నుంచి వచ్చిన ఆదాయంతోనే జీవించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అద్దె ఇంటిలోనే నివసించేవారంటే ఈతరం వారికి అతిశయోక్తిగా ఉండవచ్చు. కానీ ఇది పచ్చి నిజం.
దాదాపు అర్ధ శతాబ్దికి విస్తరించిన తన రాజకీయ జీవితంలో విజయభాస్కరరెడ్డి పెద్ద మనిషిగా, సౌమ్యుడుగా, మితభాషిగా పేరొం దారు. తన రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా బయటపడిన పరిశుభ్రమైన నాయకుడు ఆయన. రాజకీయ శత్రువులు సైతం ఆయనను ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టినప్పటికీ అవినీతి ఆరోపణలు మాత్రం ఆయనపై ఎన్నడూ చేయలేదు. ఆయనకు ప్రచారం అంటే గిట్టేదికాదు. పదిమందికి సాయం చేసి సంతోషించే మనిషి.
సామాన్య ప్రజలకు సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నించిన రాజకీయవాది. 2001 సెప్టెంబర్ 27న కన్నుమూసేదాకా పార్టీకి, ప్రజలకు విశేష సేవలందించిన ధన్యజీవి కోట్ల. ఆయన మరణంతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముఖ్యమంత్రుల శకం రాష్ట్రంలో అంతరించినట్లయింది.
కాశీపురం ప్రభాకరరెడ్డి నంద్యాల, కర్నూలు జిల్లా
(సెప్టెంబర్ 27, సోమవారం మాజీ ముఖ్యమంత్రి
కోట్ల విజయభాస్కరరెడ్డి 9వ వర్ధంతి) |
No comments:
Post a Comment